Tuesday, January 15, 2008

Postmen in the Mountains - చైనా















కధ

ఇది ఓ తండ్రీ కొడుకుల కధ.

తండ్రి పోస్ట్ మేన్. చైనాలో,హునాన్ అనబడే మారుమూల పర్వత ప్రాంతాల్లో, కాలినడకన ఉత్తారాలు బట్వాడా చేస్తుంటాడు. పెంపుడు కుక్క లాయోర్ తోడుగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం క్షీణించంటంతో ఆ ఉద్యోగం కొడుక్కి వస్తుంది.

ఉదయాన్నే కొడుకు కొత్త ఉద్యోగానికి రెడీ అవుతుంటాడు. తండ్రి విశ్రాంతి తీసుకోకుండా అతనికి ఒకటే జాగ్రత్తలు చెపుతుంటాడు. కొండలు గుట్టలు ఎక్కి ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉత్తరాలు పంచటం చిన్న విషయం కాదు. తిరిగిరావటానికి 3 రోజులు పడుతుంది. కొడుకుకి ప్రయాణంలో తోడుగా ఉండి దారిచూపుతుంది కదా అనుకుంటే, లాయోర్ వెళ్ళనని మొరాయిస్తుంది. కొడుకుకి దారి చూపటానికి తండ్రి కూడా బయలుదేరతాడు. వాళ్ళతో పాటు లాయోర్ కూడా బయలుదేరుతుంది.

పోస్ట్ మేన్ గా కొడుకిది మొదటి యాత్ర. తండ్రికిది ఆఖరిది.

పని వత్తిడిలో తండ్రి, కుటుంబంతో గడిపింది చాలా తక్కువ. బహుశా అందుకేనేమో తండ్రంటే కొడుక్కి ఏదో అర్ధంగాని భయం,బెరుకుతనం.

"నాన్న సాధించింది ఏముంది? జీవితమంతా ఈకొండలు,గుట్టలు తిరుగుతూ ఉత్తరాలు పంచటమే కదా!"

కాని కొడుకు ఈప్రయాణంలో ఓ కొత్త వ్యక్తిని చూస్తాడు.

"గిరిజనుల బాగోగులు తెలుసుకుంటూ,వారిని ఉత్సాహపరుస్తూ,సహాయపడుతున్న ఎవరీ కొత్త వ్యక్తి? ఇతనే కదూ నాన్న! ఎందుకు అతనిని చూడగానే వారిలో అంత ఆనందం? వారికి ఇంత ఆత్మీయుడు ఎలా అయ్యాడు?"

తండ్రంటే భయం బదులుగా ఆరాధన,ప్రేమ మొదలవుతాయి.

ప్రయాణంలోని ప్రతి మజిలి,ప్రతి అనుభవం ద్వారా,అతనికి తండ్రి గురించి కొత్త విషయాలు తెలుస్తాయి.

నలుగురికి ఉపయోగపడేలా జీవించటమే జీవితపరమార్ధమని,తండ్రి జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా గ్రహిస్తాడు. కేవలం వృత్తిపరమైన భాధ్యతలే కాకుండా, తండ్రి నమ్మకాలను, విలువలను కూడా కొడుకు తెలుసుకుంటాడు.


* * *

ప్రేక్షకులకు ఏదో ఒక సన్నివేశంలో తమ తండ్రులు గుర్తుకొస్తారు. సుందరమైన ప్రకృతి మన మనస్సులను హత్తుకుంటుంది. తండ్రీ,కొడుకుల నటన అందర్ని మెప్పిస్తుంది.

తండ్రి పాత్రధారి TENG RUJUN, బీజీంగ్ సెంట్రల్ డ్రామా అకాడెమీలో ప్రొఫెసర్. ఈసినిమాలోని నటనకి చైనా బెస్ట్ యాక్టర్ అవార్డ్ తో అతనిని గౌరవించారు.
Liu Ye కొడుకుగా నటించాడు. ఈసినిమా తీసేసమయంలో సెంట్రల్ డ్రామా అకాడెమీ విధ్యార్ధి.


* * *

2 comments:

Anonymous said...

నేనీ సినిమా చూడలేదు కానీ చైనీస్ సినిమాలు చాలావరకూ ఇలాంటి కథలు వుంటాయి. మీరు మొదటి పోస్టులో చెప్పినట్టు చాలా చైనీస్ సినిమాలు "మనలో మానవత్వాన్ని పరిమళింపచేసేది" గా వుంటాయి.
మీకు Road Home, Getting Home సినిమాలు కూడా నచ్చొచ్చు. Try చెయ్యండీ

Anonymous said...

వెంకట్ గారు, మీరు చెప్పిన సినిమాలు కూడా చూసాను. చైనా అనగానే ఎక్కువ మంది zhang yimou సినిమాలనే ప్రస్తావిస్తారు. నాకు ఈ సినిమా బాగా నచ్చి వ్రాసాను.

-ప్రసాద్